జాతీయం: భారత్‌లో మంకీపాక్స్ కేసులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. యూఏఈ నుంచి కేరళ వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కేరళ ఆరోగ్య మంత్రి వీనా జార్జ్ ప్రకటన ప్రకారం, ఈ వ్యక్తిని మలప్పురం జిల్లాలోని మంజేరి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఆ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు స్పష్టంగా కనిపించడంతో వైద్యులు వెంటనే శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు. పాజిటివ్ రిపోర్ట్ రావడంతో అతనికి ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో, కేరళ ప్రభుత్వం అన్ని మెడికల్ కాలేజీల్లో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, పూర్తి జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇదిలా ఉంటే, డబ్ల్యూహెచ్‌వో ఇటీవల ఆగస్టులో మంకీపాక్స్ కొత్త వేరియెంట్‌ను గుర్తించి, అంతర్జాతీయ అత్యవసర స్థితిగా ప్రకటించింది. భారత్‌లో ఈ వ్యాధి యొక్క రెండవ కేసు నమోదవడం, వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారికి ఆరోగ్య తనిఖీలు, లక్షణాల గుర్తింపు, తక్షణ వైద్య పరీక్షలు అవసరమని అధికారులు సూచిస్తున్నారు.