విజయవాడ : ఏపీలో రేపే పంచాయతీ ఎన్నికల రెండవ విడత జరగనుంది. రేపు ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు రెండవ విడత పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లోని 18 డివిజన్లలో 167 మండలాల్లోని 2786 పంచాయితీలకి ఎన్నికలు జరుగుతున్నాయి.
ఏపీ వ్యాప్తంగా ఎన్నికలకు 44 గంటల ముందే మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఏజెన్సీ గ్రామాల్లో మద్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహించి సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎంపిక ప్రక్రియ జరగనుంది. రెండవ విడతకి నోటిఫికేషన్ ఇచ్చిన మొత్తం పంచాయతీలు 3328 కాగా, వాటిలో 539 సర్పంచ్ స్థానలు ఏకగ్రీవమయ్యాయి.
రాష్ట్రం మొత్తం మీద 33,570 వార్డులు ఉండగా, వాటిలో 12,604 ఏకగ్రీవమయ్యాయి. అయితే 149 వార్డుల్లో నో నామినేషన్ ఉండటంతో 20,817 వార్డులకి రేపు ఎన్నికలు జరగనున్నాయి. 44,876 మంది అభ్యర్థులు వార్డులకి పోటీపడనున్నారు. 167 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఎన్నికల సామాగ్రిని ఈరోజు రాత్రి వరకే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు.
ఈ ఎన్నికల నిర్వహణకి 18387 పెద్ద బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేయగా, 8351 మధ్యరకం, 24034 చిన్న బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 1292 స్టేజ్ – 1 రిటర్నింగ్ అధికారులు ఉండనుండగా, 3427స్టేజ్ -2 రిటర్నింగ్ అధికారులు, 1370 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉండనున్నారు.
పంచాయితీ రాజ్ కమీషనర్, డిజిపి కార్యాలయాలలో ఎన్నికల ప్రక్రియ పరిశీలనకి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎస్ఇసి కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల కమీషనర్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించనున్నారు.