అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 సెకండ్ వేవ్ జనవరి 15 నుండి మార్చ్ 15 మధ్యలో వచ్చే అవకాశం ఉన్నట్టు ఆరోగ్య శాఖ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి సగటున రోజూ దాదాపు 600 కేసులు నమోదవుతున్నాయి.
తీవ్రత ఎక్కువున్న ఒకానొక దశలో రోజుకు 10 వేల కేసులకు పైగా కూడా నమోదయ్యాయి. తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ తాజా అంచనా ద్వారా తెలుస్తోంది. చలి తీవ్రత పెరిగే కొద్దీ కరోనా తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుందని నివేదికలో స్పష్టం చేసింది.
ఈ ప్రకారం రాష్ట్రంలో జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉండొచ్చని పేర్కొంది. సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అప్రమత్తం కావాల్సిన అవసరముందని సూచించింది. చాలా దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు అంచనా వేస్తే, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దశ నుంచి ఐదు మాసాల గ్యాప్‌తో సెకండ్ వేవ్ వచ్చిందని, ప్రస్తుతం మన దేశ రాజధాని ఢిల్లీలోనూ అదే జరిగిందని నిపుణులు అంచనా వేశారు.
ఆంధ్రలో ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఎక్కువ తీవ్రత ఉండి, ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. దీని ప్రకారం తిరిగి ఐదు మాసాల తర్వాత అంటే 2021 జనవరి 15 నుంచి మార్చి 15 లోగా సెకండ్ వేవ్‌కు అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే వైరస్ తీవ్రత సెకండ్ వేవ్‌లో ఎంతగా ఉంటుందనేది ఇప్పుడే అంచనా వేయలేమన్నారు.
సెకండ్ వేవ్ తీవ్రత ఎలా ఉన్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఆర్టీపీసీఆర్ టెస్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దీర్ఘకాలిక జబ్బుల బాధితులందరికీ టెస్టులు చేసి ఐసొలేట్ చేయాలి. ఐసీయూలు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలి. టీచర్లు, అంగన్‌వాడీ వర్కర్లకు ప్రతి 15 రోజులకు ఒకసారి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలి.
మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ కరోనా వచ్చింది. దీన్నిబట్టి చూస్తే ఇక్కడా వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. కచ్చితంగా సెకండ్ వేవ్ ఉంటుంది లేదా అస్సలు ఉండదు అని ఇప్పుడే ఏమి చెప్పడానికి వీలు లేదన్నారు.