కాన్‌బెర్రా: పురాణ సామెతలు ఎన్నో సందర్భాల్లో నిజం అవుతుంటాయి. అలాంటిది ఒకటి ఆస్ట్రేలియా లో జరిగింది. ఒక దారి మూసుకుపోతే ఇంకొక దారి తెరుచుకునే ఉంటుందనేందుకు ఓ తండ్రి కథ రుజువుగా నిలిచింది. కరోనా మహమ్మారి వల్ల ఉద్యోగం కోల్పోయిన కోట్లాది మందిలో ఆస్ట్రేలియాలోని ఆర్మడేల్‌కు చెందిన యువ తండ్రి ఒకరు.
కరోనాకు ముందు అతను సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. ఎప్పుడైతే వైరస్ ప్రభంజనం మొదలైందో అప్పుడు అతని ఏకైక ఆదాయ మార్గమైన ఉపాధి కూడా కోల్పోయాడు. దీంతో ఆయన తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. ఇదిలా వుంటే ఓరోజు అతను తన మూడేళ్ల కూతురు కోసం దుకాణంలో వస్తువులు కొనడానికి వెళ్లాడు. అయితే ఆ షాపులోని లాటరీ టికెట్లు అతని దృష్టిని ఆకర్షించాయి.
ఆ సమయంలో అతను ఓజ్ లోటో నుంచి ఓ లాటరీ టికెట్టు కొన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు లాటరీ విజేతను నిర్వాహకులు ప్రకటించారు. కానీ ఈ విషయం ఆయనకు తెలియదు. ఓ రోజు అతనికి లాటరీ టికెట్ అమ్మిన వ్యక్తి మాటల మధ్యలో లాటరీ టికెట్ విజేత డబ్బు తీసుకునేందుకు ఇంతవరకూ ముందుకు రాలేదని చెప్పాడు.
దీంతో అతను తన టికెట్ నంబర్‌ను చెక్ చేసి చూడగా ఆ విజేత తనేనని తెలిసింది. అక్షరాలా 31 కోట్ల రూపాయలు అతని సొంతమవడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. “వెంటనే ఇంటికి వెళ్లి నా బంగారు బిడ్డను గట్టిగా హత్తుకుంటా” అని సంతోషంగా చెప్పుకొచ్చాడు. అలాగే తన సోదరుడు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, ఇప్పుడు తానే ఓ ఇల్లు కొనిస్తానంటున్నాడు.