ముంబై : యువరాజ్ సింగ్, క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన పేరు. ఎడమ చేతి వాటం బ్యాట్స్ మన్ అయిన తను మంచి ఆల్ రౌండర్ గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో ప్రతిష్టాత్మక ఇన్నింగ్స్ ఆడి టీమిండియా విజయాలలో కీలక పాత్రలు పోషించాడు.
కాని క్యాన్సర్ బారిన పడి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. ఈ విష్యమై యువరాజ్ ఈ విధంగా స్పందించాడు. ‘క్యాన్సర్ జయించిన తర్వాత క్రికెట్‌లో పునరాగమనం చేసినప్పుడు కెప్టెన్‌గా కోహ్లీ నాకు మద్దతుగా నిలిచాడు. కోహ్లీ ప్రోత్సాహంతోనే ఆటగాడిగా తిరిగి జట్టులోకి వచ్చాను కానీ సెలెక్టర్ల దృష్టిలో నా స్థానం ఎక్కడుందనేది ధోనీనే చూపించాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనీ తన క్రికెట్ కెరీర్ గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకునేలా చేశాడని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. నిజమే, ధోని నాకు నా గురించి వాస్తవ చిత్రం చూపించాడు. 2019 ప్రపంచకప్ కోసం సెలెక్టర్లు నన్ను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని నాకు తెలిసేలా చేశాడు.
వాస్తవానికి 2011 ప్రపంచకప్ వరకు ఎంఎస్ ధోనికి నాపై చాలా నమ్మకముంచాడు. ధోనీ జట్టులో నన్ను ఎప్పుడు ఒక ప్రధాన ఆటగాడిగానే గుర్తించాడు. 2015 ప్రపంచకప్ తర్వాత నాకు అవకాశాలు తగ్గిపోవడంతో అది నిరూపితమయింది అని అన్నారు.
18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన యువరాజ్ ధోని సారథ్యంలోని 2007 టీ20, 2011వన్డే ప్రపంచకప్‌లు గెలుపొందిన భారత జట్టులో సభ్యుడు. ఈ రెండు ప్రపంచకప్‌ల విజయంలో యూవీ పాత్ర కీలకమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీమిండియా తరపున యూవీ 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20లు ఆడాడు. కాగా యువరాజ్ గతేడాది జూన్ 10న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.