హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు అనేక గొప్ప చిత్రాలను అందించిన ప్రముఖ నటి, నిర్మాత కృష్ణవేణి మృతి చెందారు. 102 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. చిన్నతనం నుంచే నాటక రంగంలో ప్రవేశించిన ఆమె, 1936లో అనసూయ అనే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు.
నటిగా మాత్రమే కాదు, నేపథ్య గాయనిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. సినీరంగంపై మక్కువతో నిర్మాతగా మారి మన దేశం అనే చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా ద్వారానే సీనియర్ ఎన్టీఆర్ వెండితెరపై తొలి అడుగు వేశారు. కేవలం నటనలోనే కాదు, సంగీత దర్శకుడు ఘంటసాలకు తొలి అవకాశం ఇచ్చిన ఘనత కూడా కృష్ణవేణికే దక్కింది.
ఆమె నిర్మించిన చిత్రాలు అప్పట్లోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. కృష్ణవేణి జీవిత ప్రయాణం తెలుగు సినిమా చరిత్రలో చిరస్మరణీయం. తెలుగు చిత్రసీమకు ఎనలేని సేవలందించిన ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు.