ఆంధ్రప్రదేశ్: అనంతపురంలో సంచలనం: కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ దారుణ హత్య
దారుణ హత్యకు బలి అయిన కాంగ్రెస్ నేత
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్, ఎమ్మార్పీఎస్ (MRPS) రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మీనారాయణను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. మొదట ఆయన ప్రయాణిస్తున్న కారును లారీతో ఢీకొట్టి, అనంతరం వేటకోడవళ్లతో దాడి చేశారు.
లారీ ఢీకొట్టి… వేటకోడవళ్లతో దాడి
గుంతకల్లు నుంచి చిప్పగిరికి వెళ్తున్న లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన కారులో చిక్కుకున్న ఆయనపై దుండగులు వేటకోడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే మరణించారు.
కుమారుడికి తీవ్ర గాయాలు
హత్యకు గురైన సమయంలో కారులో లక్ష్మీనారాయణ కుమారుడు వినోద్ కూడా ఉన్నాడు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం.
కేసు నమోదు – అన్ని కోణాల్లో దర్యాప్తు
పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలనతో పాటు లారీ ఓనర్ వివరాలు సేకరిస్తున్నారు. లక్ష్మీనారాయణపై దాడికి గల కారణాల్ని, దీనికి సంబంధించి వెనుక ఉన్న కుట్రను వెలికితీయడానికి ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి.
ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందన
ఈ దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక రాజకీయ నాయకుడిని ఇంత పాశవికంగా హత్య చేయడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ఎత్తిచూపుతోందని ఆమె అన్నారు. పోలీసు శాఖ అత్యున్నత స్థాయిలో విచారణ జరిపించి, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు
లక్ష్మీనారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని షర్మిల హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పోలీసు శాఖను ట్యాగ్ చేశారు.