బెంగళూరు: ఇప్పటికీ తగ్గకుండా ప్రపంచాన్ని వనికుస్తోంది కరోనా వైరస్ మహమ్మారి. ఈ తరుణంలో కోవిడ్ టీకా తయారీలో మరో ముందడుగు పడింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మరియు ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాలు సంయుక్తంగా తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకా డోసులు సుమారు నాలుగు కోట్లు సిద్ధంగా ఉన్నాయని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గురువారం ప్రకటించింది.
విడుదలకు కావాల్సిన అనుమతులు ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి లభిస్తే నోవావాక్స్ టీకా తయారీ కూడా చేపడతామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాల టీకా కోవిషీల్డ్ ప్రయోగాలు చివరిదశలో ఉన్నాయి.
కాగా టీకా పనితీరుపై ముందస్తు ఫలితాలు ప్రకటించాలని ఆస్ట్రాజెనెకా సిద్ధమవుతున్న వేళ యూకేలో వేసవి కారణంగా కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం మొదలైంది. దీంతో కంపెనీ టీకాల పంపిణీని వాయిదా వేస్తున్నట్లు గత వారం తెలిపింది.
ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా టీకాలను భారత్‌లో తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ తమ వద్ద నాలుగు కోట్ల డోసులు పంపిణీకి సిద్ధమైనట్లు ప్రకటించడం గమనార్హం. అయితే పంపిణీకి సిద్ధంగా ఉన్న డోసులు అంతర్జాతీయంగా వినియోగానికా లేక భారత్‌లో పంపిణీ చేసేందుకా అనే విషయం పై వివరణ ఇవ్వడానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నిరాకరించింది.