న్యూఢిల్లీ: కరోనా కోసం కనిపెట్టిన ‘కోవిషీల్డ్’ ట్రయల్స్‌లో పాల్గొన్న ఒక వాలంటీర్ తనకు ఆరోగ్యపరంగా దుష్ప్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక వలంటీర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై సీరం ఇన్‌స్టిట్యూట్ స్పందించింది.
సీరం ఇన్స్టిట్యూట్ తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ సురక్షితమైనదని, ఇమ్యూనోజెనిక్ అని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్ అభివృద్ధిలో తాము అన్ని నియంత్రణ, నైతిక ప్రక్రియలను అనుసరిస్తున్నామని వెల్లడించింది. అన్ని రకాల జాగ్రత్తల తర్వాతే తాము ట్రయల్స్ నిర్వహించామని అంది. సదరు వలంటీర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని తెలిపింది.
‘వలంటీర్ అనారోగ్యం గురించి నోటీసులో పేర్కొన్న విషయాలు పూర్తిగా అవాస్తవం మరియు అసంబద్ధమైనవి. ప్రస్తుతం వలంటీర్ ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితికి, సీరం ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్‌కి ఎలాంటి సంబంధం లేదు. వలంటీర్ అబద్దం చెప్తున్నాడు, అతడి అనారోగ్య సమస్యలకు కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్‌ని బ్లేమ్ చేస్తున్నాడు.
టీకా కారణంగా తన నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని సదరు వలంటీర్ ఆరోపించారు. ఈ అనారోగ్య సమస్యలన్నీ కరోనా టీకా వల్లనేనని పరీక్షల్లో తేలిందన్నారు. టీకా వల్ల మెదడు దెబ్బతిన్నదని ఈఈజీ పరీక్షలో స్పష్టమైందన్నారు. మాట, చూపు, జ్ఞాపక శక్తిలోనూ దుష్ప్రభావాలు తలెత్తాయన్నారు. దీనితో భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నారు.
ఇందుకు పరిహారంగా తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీకా దుష్ప్రభావాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పరిహారంతో పాటు తక్షణమే టీకా ప్రయోగాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న ‘కోవిషీల్డ్’ టీకాకు భారత్‌లో పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది.