ముంబై: దేశంలో ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ జరుగుతున్న వేళ పూణే సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదార్ పూణావాల ఈ రోజు ట్విట్టర్ ద్వారా ఒక కీలక ప్రకటన చేశారు. అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ నోవావాక్స్ భాగస్వామ్యంతో రూపొందిస్తున్న కోవోవాక్స్ మంచి ఫలితాలను ఇస్తోందని తెలిపారు. యూకే కోవిడ్-19 స్ట్రెయిన్‌పై నోవోవాక్స్ 89.3 శాతం ప్రభావంతంగా పనిచేస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించారు.
వచ్చే జూన్ నాటికి కోవోవాక్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని అదార్ పూణావాలా తెలిపారు. ఈ మేరకు, ‘‘కోవిడ్-19 టీకా తయారీలో నోవోవాక్స్‌తో కలిసి పనిచేస్తున్న క్రమంలో మెరుగైన ఫలితాలను పొందాం. భారత్‌లో కూడా ఇందుకు సంబంధించి ట్రయల్స్ మొదలుపెడతాం. జూన్ 2021 నాటికి కోవోవాక్స్‌ను లాంచ్ చేస్తాం’’ అని ఆయన ట్వీట్ చేశారు.
దేశంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థగా పేరున్న సీరం కంపెనీ, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో ఇప్పటికే ‘కోవిషీల్డ్’ రూపొందించింది, పంపిణీ కూడా జరుగుతోంది. కోవిషీల్డ్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ డోసులను ఇప్పటికే దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. విదేశాలకు సైతం భారత్ కోవిషీల్డ్ డోసులు ఎగుమతి చేస్తోంది.
అమెరికాకు చెందిన నోవావాక్స్‌ను 15 వేల మందికి పైగా వాలంటీర్లపై ప్రయోగించగా, వారిలో 89.3 శాతం మందిలో కరోనాను తట్టుకునే యాంటీబాడీలు తయారయ్యాయి. ఇక 85.6 మందిలో కొత్త స్ట్రెయిన్‌కు కూడా తట్టుకోగల సామర్థ్యం వచ్చిందని సంస్థ ప్రకటించింది. ఈ స్ట్రెయిన్‌పై ఏ వ్యాక్సిన్ పని చేయబోదన్న వార్తల నేపథ్యంలో నోవావాక్స్ కొంతమేర అడ్డుకట్ట వేయడం ఊరట కలిగించే అంశంగా పరిణమించింది.