అమరావతి: ఏపీలో మహిళల రక్షణకు ‘శక్తి’ యాప్ ప్రారంభం
రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల రక్షణ కోసం పోలీసు శాఖ ‘శక్తి’ (Shakti) యాప్‌ను ప్రారంభించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) దీనిని ఆవిష్కరించారు. ఇది మహిళలకు నిత్యం తోడుగా ఉండే ఓ ‘పాశుపతాస్త్రం’లా పనిచేస్తుందని పోలీసులు పేర్కొన్నారు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. 10 సెకన్లలో రక్షణ
మహిళలు ఆపదలో ఉన్నప్పుడు యాప్‌లోని SOS (Save Our Souls) ఆప్షన్ నొక్కితే, వారి లొకేషన్, వీడియో, ఆడియో కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసే వీలుంది. ఫోన్ ఊపినా (Shake Trigger) సమాచారాన్ని పోలీసులకు చేరవేయొచ్చు.
సురక్షిత ప్రయాణానికి.. సేఫ్ ట్రావెల్
ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు Safe Travel ఆప్షన్ ద్వారా వాహన నంబర్, ప్రయాణ మార్గాన్ని షేర్ చేయవచ్చు. పోలీస్ కంట్రోల్ రూమ్ వాహనాన్ని ట్రాక్ చేస్తుంది. మార్గం తప్పితే వెంటనే స్పందన ఉంటుంది.
ఠాణాకు వెళ్లకుండానే ఫిర్యాదు
మహిళలు వేధింపులు, లైంగిక దాడులు, గృహ హింస, సైబర్ క్రైమ్, ఫోటో మార్ఫింగ్, పరువు హత్యలు తదితర నేరాలపై Give a Complaint ఆప్షన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
కుటుంబ సమస్యలకు కౌన్సెలింగ్
గృహ హింస, భర్త వేధింపులు, కుటుంబ కలహాలు వంటి సమస్యలకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సేవలు పొందే వీలుంది. అదృశ్యమైన పిల్లల సమాచారం అందజేసి, పోలీసుల సహాయం పొందొచ్చు.
తక్షణమే సహాయం పొందేలా.. 5 అత్యవసర నంబర్లు
అప్రమత్తత కోసం కుటుంబ సభ్యులు, స్నేహితుల ఐదు నంబర్లు యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. ఆపద సమయంలో SOS నొక్కిన వెంటనే వారికి సమాచారం చేరుతుంది.
ప్రజల భద్రతకు కొత్త ముందడుగు
ఈ యాప్ ద్వారా బహిరంగ మద్యపానం, మాదకద్రవ్యాలు, చీకటి ప్రదేశాల్లో అసౌకర్యాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై కూడా ఫిర్యాదు చేయొచ్చు.
తక్షణ సహాయం కోసం నంబర్లు
యాప్‌లోని లింక్ ద్వారా Dial 100, Dial 112, వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు నేరుగా కాల్ చేయొచ్చు.