సీనియర్ డైరెక్టర్ శంకర్ కెరీర్‌లో ఇప్పుడు కీలక మలుపు తిరిగినట్టుగా కనిపిస్తోంది. భారీ అంచనాలపై వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ ఫలితం అంచనాలను తలకిందలు చేయడంతో, శంకర్ ఒక్కసారిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. తెలుగు ఇండస్ట్రీలో రూట్ సెట్ చేసుకోవాలన్న ఆశలు తుడిచేసినట్టయ్యాయి.
ప్రస్తుతం శంకర్ చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ‘భారతీయుడు 3’. అయితే ‘భారతీయుడు 2’ డిజాస్టర్ తర్వాత మూడో భాగంపై ఆసక్తి పెద్దగా లేదు. ఇటీవల ‘భారతీయుడు 3’ ఓటీటీలో విడుదలవుతుందనే వార్తలు వచ్చినా, మేకర్స్ క్లారిటీ ఇచ్చి థియేట్రికల్ రిలీజ్‌కే వస్తుందని తెలిపారు.
ఇప్పటికే వాయిదాల మధ్య ఉన్న ‘భారతీయుడు 3’ విడుదల తర్వాత శంకర్ రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకోనున్నట్టు ఇండస్ట్రీ టాక్. ఈసారి ఫ్రెష్ మైండ్‌తో, కొత్త దిశలో స్క్రిప్ట్ రైటింగ్ చేయాలని ఆయన భావిస్తున్నారని సమాచారం.
శంకర్ సాధారణంగా సినిమాల తర్వాత గ్యాప్ తీసుకుంటారు. కానీ ఈసారి ‘గేమ్ ఛేంజర్’ వంటి ఫ్లాప్ ఒత్తిడిలో ఈ గ్యాప్ మరింత లాంగ్ అయ్యే సూచనలు ఉన్నాయి. మంచి రైటర్, బలమైన కథ లేకుండా తిరిగి ట్రాక్‌లోకి రావడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
‘భారతీయుడు 3’ విజయం శంకర్ భవిష్యత్తును నిర్ధారించనుంది. మరి శంకర్ మరోసారి ఇండస్ట్రీలో తన మాంత్రిక టచ్ చూపించగలడా అనేది ఆసక్తికరమే.