ఆంధ్రప్రదేశ్: కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తన సోదరుడు జగన్ నేతృత్వంలోని వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు ప్రజా ధనాన్ని పందికొక్కుల్లా దోచుకున్నట్లు ఆమె ఆరోపించారు.
ప్రజల కోసం పనిచేయాల్సిన నాయకులు కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం పరిమితమయ్యారని అన్నారు. ఇటీవల బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై కూడా షర్మిల స్పందించారు.
కాంగ్రెస్‌కు విధానం లేదని బొత్స వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని, బీజేపీకి దత్తపుత్రుడిగా వైసీపీ వ్యవహరించడం అందరికీ తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. 151 సీట్లు ఉన్న వైసీపీ, ప్రజలు తిరస్కరించి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తు చేశారు.
గుంటూరు మిర్చి యార్డు రైతుల సమస్యలను తామే వెలుగులోకి తెచ్చామని, కానీ వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు మాత్రమే స్పందించడాన్ని ఆమె తప్పుబట్టారు. ప్రజల సమస్యలపై వైసీపీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదని షర్మిల విమర్శించారు.
తదుపరి ఎన్నికల్లో వైసీపీ ప్రజల దృష్టిలో మరింత వెనుకబడుతుందని షర్మిల ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుందని, త్వరలోనే తమ పార్టీ బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని తెలిపారు.