ఏపీ: వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. ఈ కేసులో సునీత ప్రాణాలకు ముప్పు ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాక్షులను బెదిరిస్తూ, న్యాయం తారుమారవుతోందని ఆమె ఆరోపించారు.
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పై బయట ఉండటమే ఈ పరిస్థితికి కారణమని షర్మిల అన్నారు. సునీతను ఏమైనా చేస్తారన్న భయం తమకు ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవల కొన్ని విషయాలు తన దృష్టికి వచ్చాయని, అవి ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడించారు.
సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఆమె భద్రతపై ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. అవినాశ్ బెయిల్ రద్దు కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో కీలక విషయాలు ఉన్నాయని పేర్కొన్నారు.
విచారణ అధికారులను బెదిరించి తప్పుడు రిపోర్టులు తయారు చేయించారని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. అవినాశ్ బెయిల్ రద్దు అయితేనే సునీతకు న్యాయం జరగనుందని షర్మిల అభిప్రాయపడ్డారు.
వివేకా హత్య జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో అవినాశ్ రెడ్డే ఉన్నారని తేల్చి చెప్పారు. నిజం బయటకు రావాలంటే, నిందితులు అనర్హులయ్యేంతవరకూ పోరాడుతానని షర్మిల స్పష్టం చేశారు.