ఆంద్రప్రదేశ్: కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాజకీయాల్లో కొత్త దారిపడుతూ దూకుడుగా మారారు. గతంలో కుటుంబ ఆస్తుల వివాదాలతో తీరిక లేకుండా గడిపిన ఆమె, ఇప్పుడు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం ప్రారంభించారు.
ఇటీవల విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ విజయవాడలో నిర్వహించిన ధర్నా విజయవంతం అవ్వటంతో, ఆమెను ప్రజలు అనుకూలంగా స్వాగతిస్తున్నారు. ఈ నిరసనకు ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందన, షర్మిలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని అనిపిస్తోంది.
ఇప్పటి వరకు కుటుంబ రాజకీయాల కోసం ఉన్నారన్న ఆరోపణలు కొంత తగ్గినట్టే. రాజకీయాల్లో ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ప్రజల సమస్యల పట్ల ఆమె శ్రద్ధ ప్రజల్లో అనుకూల ముద్ర వేస్తున్నాయి.
షర్మిల ఈ కొత్త ఊపును కొనసాగించి, ప్రజా సమస్యల పట్ల తన గళం వినిపిస్తే, రాజకీయ నాయకురాలిగా ఎదగటానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం వైసీపీ తమ సొంత విషయాల్లో నిమగ్నమై ఉండటంతో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఉందని, షర్మిల చేసిన ఈ ముందడుగు ప్రజలకు మేలు చేసే అవకాశముందని కొందరు భావిస్తున్నారు.
అయితే, ఈ ఉత్సాహం నిరంతరంగా కొనసాగించి, మళ్లీ ఆస్తుల అంశాల చుట్టూ తిరగకుండా ప్రజల కోసం ఆమె పనిచేస్తే, షర్మిలకు రాష్ట్ర రాజకీయాల్లో మంచి భవిష్యత్ ఉంటుందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.