ఆంధ్రప్రదేశ్: షర్మిల ఆన్ మెడికల్ లీవ్ – రాజకీయాల్లో మళ్లీ దూకుడు!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy) రాజకీయంగా ఎప్పుడూ చురుగ్గానే ఉంటారు. సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లు, మీడియా సమావేశాల్లో ఘాటైన విమర్శలు ఆమె ప్రత్యేకత.
కానీ, గత కొన్ని రోజులుగా ఆమె కనిపించకుండా పోయారు. ఎక్స్ లో నిశ్శబ్దంగా మారడం, మీడియాకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. చివరకు విజయవాడ ఇందిరా భవన్ లో ప్రత్యక్షమైన ఆమె… మళ్లీ రాజకీయంగా దూకుడు పెంచారు.
మెడికల్ లీవ్ మాత్రమే!
ప్రముఖంగా షర్మిల లేనిదే అంటూ వచ్చిన ప్రశ్నలకు ఆమె తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. “నేను కనబడటం లేదు అంటే.. మెడికల్ లీవ్ అనుకోవచ్చు కదా?” అంటూ మీడియాపై సెటైర్లు వేశారు.
పార్టీ నేత శైలజానాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ (YSR Congress) లో చేరడాన్ని తప్పుబట్టారు. “ఆ పార్టీలో అధికారం లేదు.. డబ్బు మాత్రమే ఉంది.. అందుకే వెళ్లి ఉండొచ్చు” అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతికి మోదీ సున్నం కొట్టి పోతారా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అమరావతి రెండో దశ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రానుండటంపై షర్మిల తనదైన శైలిలో స్పందించారు. “మోదీ ఒకసారి వచ్చి మట్టి కొట్టి వెళ్లారు. ఈసారి సున్నం కొట్టి పోతారు” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
వక్ఫ్ బిల్లుపై చంద్రబాబు కుట్ర – ఇఫ్తార్ విందుతో మోసం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడం హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెడతుందని షర్మిల ఆరోపించారు.
“ఇది ముస్లింల ఆస్తులను హరించేందుకు పెట్టిన కుట్ర. ఇఫ్తార్ విందు పెట్టి, అందులో విషం కలిపినట్లుంది!” అంటూ షర్మిల చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రవీణ్ పగడాల మృతి – వైసీపీ మత రాజకీయాలు?
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో మత వివాదాలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
అయితే, పోలీసుల దర్యాప్తు ద్వారా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “హత్య అని ఆధారాలు లభిస్తే, తాను స్వయంగా డీజీపీని కలుస్తా” అని షర్మిల తెలిపారు.
అవినాష్ బెయిల్ – న్యాయం ఎక్కడ?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్‌పై విముక్తి పొందడం న్యాయవ్యవస్థను అణగదొక్కే ప్రయత్నమని షర్మిల మండిపడ్డారు.
“అతను బయట ఉండి సాక్ష్యాలను తారుమారు చేస్తూ, దర్యాప్తు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇలా జరిగితే ఏ న్యాయం జరుగుతుంది?” అంటూ ప్రశ్నించారు. తాను వైఎస్ సునీతకు పూర్తిగా మద్దతుగా నిలుస్తానని స్పష్టం చేశారు.