బంగ్లాదేశ్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన మాతృభూమికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రస్తుత ప్రభుత్వం అమాయకుల ప్రాణాలను కాపాడడంలో విఫలమైందని ఆరోపించారు.
ఆమె ప్రత్యర్థి మహ్మద్ యూనస్‌ను ఉగ్రవాదిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జూలై-ఆగస్టులో జరిగిన ఆందోళనల్లో అనేకమంది మరణించినప్పటికీ, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని హసీనా విమర్శించారు.
విచారణ కమిటీలను రద్దు చేయడం, ప్రభుత్వ భవనాలపై దాడులు జరుగుతుండటమే యూనస్ హయాంలో పాలన ఎలా ఉందనానికి నిదర్శనమని పేర్కొన్నారు.
దేశంలో పరిస్థితులు మెరుగుపడటానికి చర్యలు తీసుకోలేకపోవడం, ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిపోవడమే ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యమని ఆమె ఆరోపించారు. ప్రజలు తిరుగుబాటు చేయాలని, దుర్మార్గ పాలనను అరికట్టాలని హసీనా పిలుపునిచ్చారు.
ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆమె మద్దతుగా నిలిచారు. తాను త్వరలో తిరిగి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని, అన్యాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హసీనా స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతుండటంతో, హసీనా తిరిగి రాకపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.