అమెరికా: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పై మళ్ళీ కాల్పులు ఘటన సంచలనం సృష్టించింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సమీపంలో కాల్పులు జరిగినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు వెల్లడించారు.
ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో గోల్ఫ్ ఆడుతుండగా ఓ అనుమానాస్పద వ్యక్తి ఆయుధంతో సంచరించాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమై అతనిపై కాల్పులు జరపడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ కాల్పులు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గోల్ఫ్ క్లబ్ వద్ద చోటుచేసుకున్నాయి. ట్రంప్‌ను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు.
అయితే, దుండగుడు ఓ ఎస్‌యూవీ వాహనంలో పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేసి, ఏకే-47 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
ట్రంప్‌పై రెండోసారి హత్యాయత్నం
ఇది ట్రంప్‌పై రెండోసారి కాల్పుల ఘటన కావడం గమనార్హం. గత జులైలో పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కూడా కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ కుడి చెవిని తూటా దాటిపోవడంతో అతను ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ మరియు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ స్పందిస్తూ, ట్రంప్ సురక్షితంగా ఉన్నారని, అమెరికాలో హింసకు తావులేదని వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో ఈ తరహా హత్యాయత్నాలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కూడా ఈ విషయంపై అధికారుల నుంచి సమాచారం అందినట్లు తెలిసింది.