స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా మొహాలీలోని ఫేజ్-4 సివిల్ ఆసుపత్రికి సుమారు రూ.35 లక్షల విలువైన వైద్య పరికరాలు విరాళంగా అందించారు.
వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్లు, ఆపరేషన్ థియేటర్ టేబుళ్లు, సీరింగ్ పంపులు, ఎక్స్‌రే మెషీన్లు తదితర పరికరాలను ఆసుపత్రికి అందజేసిన గిల్ చర్యను సివిల్ సర్జన్ డాక్టర్ సంగీత జైన్ అభినందించారు. అవసరాన్ని బట్టి ఈ పరికరాలను ఇతర ఆసుపత్రులకు కూడా ఉపయోగించనున్నట్లు ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమానికి గిల్ అత్త, పాటియాలా జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కుశాల్దీప్ కౌర్ హాజరయ్యారు. గిల్ చిన్నతనం నుంచీ మొహాలీ నగరంతో గాఢ అనుబంధం కలిగి ఉండటంతో, అక్కడి ఆరోగ్య వ్యవస్థకు సహకరించడం ఎంతో ప్రత్యేకంగా మారింది.
ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్‌లో గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించిన జట్టు టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది.
తదుపరి మ్యాచ్‌ను గుజరాత్ జట్టు ఏప్రిల్ 19న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. గిల్ ఆటతో పాటు, సేవలతోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.