చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అనుహ్యంగా రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ తాజాగా తన మనసు మార్చుకున్నట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడిగా తిరిగి కొనసాగడానికి తాను అంగీకరించినట్లు తెలుస్తోంది. గురువారం చండీగఢ్‌లోని పంజాబ్ భవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతో నవజోత్ సింఘ్ సిద్ధూ భేటీ అయ్యారు.
ఇటివల పంజాబ్‌లో డీజీపీ, అడ్వొకేట్ జనరల్ నియామకంపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి విదితమే. దీనిలో ఏదో ఒక నియామకాన్ని నిలిపివేస్తామని సీఎం చన్నీ హామీ ఇవ్వడం వల్ల సిద్ధూ కాస్త మెత్తబడినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
దీనితో పాటు ఒక సమన్వయ కమిటీని(కో–ఆరి్డనేషన్ ప్యానెల్) ఏర్పాటు చేసుకోవాలని కూడా ఇరువురూ నిర్ణయానికొచి్చనట్లు తెలిసింది. ఈ సమన్వయ కమిటీలో ముఖ్యమంత్రి చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూతోపాటు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ నుండి ఒక ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. రాబోయే భవిష్యత్తు కాలంలో ప్రభుత్వం ఏ కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా ముందు దానిని కమిటీలో చర్చిస్తారు. ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తారు.
అద్యక్షుడు సిద్ధూ మరియు ముఖ్యమంత్రి చన్నీ మధ్య 2 గంటలపాటు ఈ భేటీ కొనసాగింది. భేటీ తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. సీడబ్ల్యూసీ సమావేశం అతిత్వరలోనే నిర్వహించబోతున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా గురువారం చెప్పారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య కాలంలో లుకలుకలు, అసంతృప్త గళాలు పెరిగుతున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దడానికి సీడబ్ల్యూసీ భేటీ తక్షణమే నిర్వహించాలని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్‌లో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన సీడబ్ల్యూసీ సమావేశంపై అధినేత సోనియా గాంధీ కూడా ఇటీవలే సంకేతాలిచ్చారని రణదీప్ సూర్జేవాలా చెప్పారు.