టాలీవుడ్: విజయ్ దేవరకొండ తమ్ముడిగా ‘దొరసాని’ సినిమాతో ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్‘ అనే సినిమాతో ప్రజాదరణ పొందాడు ఈ హీరో. ఈ సినిమా ఓటీటీ లో విడుదలైన కూడా మంచి వినోదం తో ఆకట్టుకుని మంచి టాక్ సంపాదించుకుంది. ఇపుడు తన మూడవ సినిమాగా ‘పుష్పక విమానం’ అనే క్లాసిక్ కమల్ హాసన్ నటించిన సినిమా టైటిల్ తో రాబోతున్నాడు. కింగ్ అఫ్ ది హిల్ , తంగా ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ దేవర కొండ సమర్పణలో గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దామోదర అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవబోతున్నాడు.
ఈ సినిమా నుండి ‘సిలకా’ అంటూ సాగే మొదటి పాటని విడుదల చేసింది సినిమా టీం. ఈ పాటని విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేయించారు. ‘మాయ’, ‘వూరెళ్ళిపోతా మామ’, ‘చిట్టి నీ నవ్వుంటె’ పాటల ద్వారా బాగా పేరు సంపాదించిన రామ్ మిర్యాల ఈ పాటని ఆలపించారు. ఈ సినిమాకి సంగీతం కూడా రామ్ మిర్యాల అందిస్తున్నారు. ఈ సినిమాతో మొదటి సారి రామ్ సంగీతం అందిస్తున్నాడు. అంతే కాకుండా ఈ పాటకి సాహిత్యం కూడా ఆనంద్ గుర్రం తో కలిసి రామ్ మిర్యాల అందించడం విశేషం. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండతో పాటు గీత సాయిని, శాంవే మేఘన, సునీల్, నరేష్ నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల వివరాలు మరి కొద్దీ రోజుల్లో తెలియాల్సి ఉంది.