హైదరాబాద్: సొగసు చూడ తరమా, ఈ సినిమా విడుదలయ్యి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 1995 లో విడుదలైన ఈ సినిమాకి సొంత కుటుంబ సహకారం తో గుణశేఖర్ నిర్మించి దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ సినిమా ఆ సంవత్సరం ఉత్తమ సినిమా గా అలాగే ఇందులో నటించిన నరేష్ (సీనియర్) ఉత్తమ నటుడిగా ఆ సంవత్సరం ప్రకటించిన నంది పురస్కారాలు కూడా స్వీకరించారు. ఇద్దరు భార్య భర్తల మధ్య ఉండే బంధాన్ని అతి తక్కువ పాత్రలతో చాలా లయ బద్ధంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు గుణశేఖర్. ఈ సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం గా ఈ సినిమాలో నటించిన నరేష్ కి, ఇంద్రజ కి అలాగే ఈ సినిమాకి తోడ్పాటు అందించిన శివగామి రమ్యకృష్ణ కి ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్ గుణశేఖర్.
గుణ శేఖర్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఒక్కడు సినిమా. గుణ శేఖర్ కి , మహేష్ బాబు కి కమర్షియల్ గా ఇంకో రేంజ్ కి తీసుకెళ్లిన సినిమా ఒక్కడు. కానీ అంతకముందు గుణ శేఖర్ కళాత్మకమైన సినిమాలు బాగానే రూపొందించారు. ఆయన దర్శకత్వం వహించిన 12 సినిమాల్లో 6 సినిమాలకి నంది అవార్డులు, ఒక సినిమాకి నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు కూడా పొందారు అంటే ఆయన దర్శకత్వ ప్రతిభ అర్ధం అవుతుంది. తీసిన సినిమాలు అన్ని ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా వైవిధ్య భరితం గా తీయగలిగారు. చివరగా తీసిన సినిమా ‘రుద్రమదేవి’ గ్రాఫిక్స్ పరంగా నిరాశ పరచినా కూడా కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గుణశేఖర్ ప్రస్తుతం రానా తో చెయ్యబోయే పాన్ ఇండియా సినిమా ‘హిరణ్య కశ్యప‘ సినిమా పై ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించి షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు.