బెల్లంపల్లి రూరల్ : తెలంగాణ లో బెల్లంపల్లి మండలంలోని పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన ముత్తె శంకరి (56) సింగరేణి కార్మికుడు హత్యకు గురయ్యాడు. బెల్లంపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.జగదీష్, తాళ్లగురిజాల ఎస్సై బి.సమ్మయ్య వివరాల ప్రకారం, పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన ముత్తె శంకరి శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్‌కె–7 గనిలో టింబర్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
శంకరికి, అతని కుటుంబ సభ్యులకు తరచూ గొడవలు జరిగేవి. దీంతో శంకరి మంచిర్యాలలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం భార్య విజయ శంకరికి ఫోన్ చేసి కూతురుకి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఇంటికి రావాలని సూచించింది. దీంతో శంకరి శుక్రవారం ఇంటికి వచ్చాడు.
రాత్రి నిద్రిస్తుండగా భార్య, కూతురు స్వాతి, కుమారుడు శ్రావణ్ కుమార్ శంకరి మెడకు చీరతో బిగించి హత్య చేశారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానంతో కుటుంబీకులను గట్టిగా విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది.
ఘటనాస్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ ఎం.ఏ రహమాన్ పరిశీలించారు. ఉద్యోగం కోసమే హత్య చేశారని శంకరి చెల్లెలు రుక్మిణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.