తెలంగాణ: సిరిచెల్మ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం – అతి పవిత్ర శైవక్షేత్రం
చరిత్రలోకి తొంగిచూసిన అద్భుత శైవక్షేత్రం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే పవిత్ర శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిదిగా భావించబడుతోంది. చుట్టూ చెరువు మధ్యలో ఉండే ఈ దేవస్థానం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.
శిల్ప సంపదకు ప్రతిరూపం
ఈ ఆలయం ప్రాచీన శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే అద్భుత కట్టడం. ఆలయ గర్భగుడిలోని శివలింగం ఎదుట రెండు నంది విగ్రహాలు ఉండటం ప్రత్యేక ఆకర్షణ. ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల విగ్రహాలు, కార్తికేయుడు, శ్రీవేంకటేశ్వర స్వామి, వినాయకుడు, సప్త మాతృకలు, అష్టలక్ష్మి, బౌద్ధ మత తాత్వికతను ప్రతిబింబించే ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడు, జైన తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడి విగ్రహాలు ఉన్నాయి.
సూర్య కిరణాలు గర్భగుడికి నమస్కారం
ఈ ఆలయం తూర్పుముఖంగా ఉండటంతో సూర్యోదయ సమయంలో గర్భగుడిలోని శివలింగంపై నేరుగా సూర్యరశ్మి ప్రతిబింభించే అద్భుత దృశ్యం కనిపిస్తుంది. ఇది ఆలయ ఆర్కిటెక్చర్‌లో అత్యంత అరుదైన విశేషాల్లో ఒకటి.
నీటిలో పుణ్యక్షేత్రం
సంవత్సరంలో ఎనిమిది నెలల పాటు ఆలయం పూర్తిగా చెరువు నీటితో చుట్టుముట్టబడి ఉంటుంది. వేసవి కాలంలో కొంత నీటి మట్టం తగ్గినా, వర్షాకాలం, చలికాలాల్లో భక్తులు నడుము లోతు నీటిలో నడుచుకుంటూ ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు.
ప్రత్యేక పూజలు, జాతర సందడి
ప్రతి సోమవారం, శనివారం ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తుల మహా జాతర జరుగుతుంది. కేవలం ఆదిలాబాద్ నుండే కాకుండా, సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా భక్తులు తరలి వచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు.
భక్తుల కోరికలు తీరే ఆలయం
శతాబ్దాల చరిత్ర కలిగి ఉన్న ఈ ఆలయం, కోరికలు తీర్చే దేవస్థానంగా భక్తులలో విశ్వాసాన్ని పొందింది. శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం తరహాలోనే భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భాసిల్లుతుంది.