అమరావతి: ఏపీలో ఉన్న ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి కోసం ఒక ప్రత్యేక కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. విశాఖపట్నంలో హై ఎండ్ స్కిల్ యూనివర్శిటీని, తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో పాఠ్యాంశాల రూపకల్పన, పాఠ్య ప్రణాళిక అనేది హై ఎండ్ స్కిల్స్ యూనివర్శిటీ, స్కిల్ యూనివర్శిటీలు రూపొందిస్తాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
స్కిల్ డెవలప్‌మెంట్‌పై సీఎం జగన్ ఇవాళ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ, ‘విశాఖపట్నంలో హై ఎండ్ స్కిల్స్ యూనివర్శిటీ పనులను వెంటనే మొదలుపెట్టండి. నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కోర్సుల రూపకల్పన విప్లవాత్మకంగా ఉండాలి.
రాష్ట్రంలో ఐటీఐలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. పాఠ్యాంశాలను అప్‌గ్రేడ్ చేయాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఐటీఐలోనూ నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ లాంటి సంస్థలను భాగస్వాములుగా చేసే ఆలోచన చేయాలి. దీనివల్ల విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు.
స్కిల్డ్ కళాశాలలతో పాటు నియోజకవర్గానికి ఒక ఐటీఐ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గ స్థాయిలో తప్పనిసరిగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఒక పారిశ్రామిక శిక్షణా సంస్ధ ఏర్పాటవుతుందన్నారు. ప్రభుత్వ ఐటీఐల్లో అవసరమైన టీచింగ్ స్టాఫ్‌ను పెట్టాలి. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో టీచింగ్ సిబ్బందిపై పరిశీలన చేయాలన్నారు.