ఒకప్పుడు వీడియో కాల్స్‌కి మారుపేరు అయిన స్కైప్ త్వరలో పూర్తిగా మూతపడనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించనప్పటికీ, తాజా అప్‌డేట్‌లో మే నెల నుంచి స్కైప్ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కంపెనీ పూర్తిగా టీమ్స్ యాప్‌కి ప్రాధాన్యతనివ్వనుంది.
2003లో ప్రారంభమైన స్కైప్ 2011లో మైక్రోసాఫ్ట్ చేతికి వెళ్లింది. విండోస్ 10లో దీన్ని ఇంటిగ్రేట్ చేసినా, వినియోగదారుల ఆసక్తి తగ్గిపోయింది. 2017లో టీమ్స్ ప్రారంభమైనప్పటి నుంచి స్కైప్‌కి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక, వ్యాపార వాడకంలో టీమ్స్ ప్రాధాన్యత పెరగడంతో స్కైప్ అస్తిత్వమే ప్రశ్నార్థకమైంది.
స్కైప్ బలహీనపడటానికి ప్రధాన కారణం గూగుల్ మీట్, జూమ్, ఫేస్‌టైమ్, వాట్సాప్ వంటి యాప్‌ల పెరుగుదల. అంతేకాకుండా, మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ విఫలం కావడం కూడా దీని తగ్గుదలపై ప్రభావం చూపింది.
ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో స్కైప్ మూసివేతపై నోటిఫికేషన్లు వస్తుండటం గమనార్హం. వినియోగదారులు ఇకపై టీమ్స్ వైపే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒకప్పుడు వీడియో కమ్యూనికేషన్‌లో అగ్రస్థానంలో ఉన్న స్కైప్.. పెరుగుతున్న పోటీకి తట్టుకోలేక గేమ్ నుంచి తప్పుకుంటోందనే చెప్పాలి.