నల్గొండ: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గత శనివారం చోటుచేసుకున్న ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు సజీవంగా బయటపడతారని ఆశించినప్పటికీ, వారు మృతి చెందారని అధికారికంగా ప్రకటించారు.
టన్నెల్ లోపల 3 మీటర్ల లోతు బురదలో మృతదేహాలను గుర్తించారు. ఆధునిక పరికరాలు, రాడార్ టెక్నాలజీ సాయంతో ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం కీలక పాత్ర పోషించింది.
మృతుల్లో ఇద్దరు ఇంజినీర్లు కాగా, మిగిలిన ఆరుగురు కార్మికులు. వారిని రక్షించేందుకు అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం కృషి చేసినా, అనుకున్న ఫలితం రాలేదు.
ఆక్సిజన్ అందించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు జరిగినా, లోపల గాలిపోటల తీవ్రత, నీటి లీకేజీ కారణంగా రక్షణ చర్యలు విఫలమయ్యాయి. చివరకు, నిరాశ కలిగించే వార్త వెలువడింది.
ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. టన్నెల్ భద్రతా ప్రమాణాలపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నారు.