వాషింగ్టన్: స్నోఫ్లేక్, క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ ఎవరూ ఊహించనన్ని లాభాలను పొందుతోంది. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ తన మూడవ త్రైమాసిక ఆదాయం వివరాలను ఇటీవలే వెల్లడించింది. స్నోఫ్లేక్ సంస్థ యొక్క ఆదాయం గత ఏడాది కంటే రెట్టింపు అయినట్లు నివేదికలో తెలిపింది.
ఈ కంపెనీ తొలిసారి సెప్టెంబర్ 15న పబ్లిక్ ఆఫరింగ్‌కు వెళ్లినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కంపెనీ షేర్ ధర దాదాపు 223 శాతం వరకు పెరిగింది. ఆ సంస్థ ఆదాయం ఇప్పుడూ భాగా పెరగడంతో కంపెనీ సీఈఓ ఫ్రాంక్ స్లూట్‌మ్యాన్ ఆదాయం కూడా భారీగా పెరిగింది. దీంతో స్లూట్‌మ్యాన్ ఒక్కసారిగా ప్రపంచంలోనే ఎక్కువ మొత్తం అందుకుంటున్న సీఈవోల జాబితాలో చేరిపోయారు. ప్రస్తుతం తన నెల ఆదాయం 108 మిలియన్ డాలర్ల(795 కోట్లు) కంటే ఎక్కువగా ఉంది. ఈ మొత్తమంతా షేర్ల రూపంలో ఆయన ఖాతాలో జమవుతోంది.
మిస్టర్ స్లూట్‌మ్యాన్ షేర్ల రూపంలోనే కాకుండా ఒక సంవత్సరానికి $3,75,000 వార్షిక మూల వేతనం కూడా పొందుతున్నారు. 2019 ఏప్రిల్‌లో సంస్థలో చేరినప్పటి నుంచీ నాలుగేళ్ల వరకు షేర్ ద్వారా వచ్చిన డబ్బులు తన అకౌంట్ లోకి వచ్చి చేరుతుంటాయి. 2023 ప్రారంభంలో తాజా వాటా ధర ఆధారంగా అయన ఖాతాలో షేర్ ద్వారా వచ్చిన డబ్బులను లెక్కిస్తే తన ఆదాయం 5.2 బిలియన్ డాలర్లు(రూ.38 వేల కోట్లు)గా ఉండనుంది.