మూవీడెస్క్: నవంబర్ మొదటి వారంలో పలు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్, క, అమరన్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కంటెంట్ బలంతో ఆకట్టుకొని విజయవంతంగా దూసుకుపోతుండడంతో, ఈ వారం చిన్న సినిమాల పట్ల ప్రేక్షకుల ఆసక్తి కొంత తగ్గినట్లు కనిపిస్తోంది.
దీంతో కొత్తగా విడుదల కానున్న సినిమాలపై బజ్ తక్కువగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ వారం అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నిఖిల్ నటించిన ఈ చిత్రం నవంబర్ 8న విడుదల కానుంది.
హఠాత్తుగా ప్రచారంలోకి వచ్చిన ఈ సినిమా బలమైన ప్రచారంతో కొంత ఆసక్తిని రేకెత్తించిందని చెప్పవచ్చు.
అలాగే, ధూమ్ ధామ్, జితేందర్ రెడ్డి, జాతర, ఈసారైనా, రహస్యం ఇదం జగత్, వంచన, జ్యూయల్ థీఫ్ వంటి సినిమాలు ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇవన్నీ పబ్లిసిటీ పరంగా కొంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో విజయాన్ని సాధించడం సవాలుగా మారింది.
ప్రత్యేకంగా నవంబర్ 7న తమిళ డబ్బింగ్ సినిమా బ్లడీ బెగ్గర్ కూడా విడుదలవుతోంది.
జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్రొడక్షన్ లో రూపొందిన ఈ సినిమా మన తెలుగు ప్రేక్షకుల్ని ఎంత మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.