హైదరాబాద్: హైదరాబాద్ రవాణాశాఖలో స్మార్ట్‌కార్డుల కొరత మళ్లీ వచ్చింది. వాహనదారులకు పోస్టు ద్వారా అందజేయాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు మరియు ఆర్సీ కార్డులు గత రెండు నెలలుగా నిలిచిపోయాయి. కార్డుల కొరత వల్ల గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు లక్షకు పైగా వినియోగదారులు తమ స్మార్ట్‌కార్డుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
కొత్త వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకొని, డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు సకాలంలో స్మార్ట్ కార్డులు లభించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్య వల్ల ట్రాఫిక్ ఉల్లంఘనల కింద రూ.వేలల్లో జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. రవాణాశాఖ నిబంధనల మేరకు వినియోగదారులు ఎలాంటి పౌర సేవల కోసమైనా ముందే ఆన్‌లైన్ ద్వారా ఫీజులు చెల్లిస్తారు.
సర్వీస్ చార్జీలతో పాటు, పోస్టల్ చార్జీలను కూడా ఆర్టీఏ ఖాతాలో జమ చేస్తారు. ఇలా సర్వీసు చార్జీల రూపంలోనే ఒక్క హైదరాబాద్ నుంచి ఏటా రూ.100 కోట్ల మేర ప్రజలు చెల్లిస్తారు. కానీ రవాణాశాఖ అందజేసే పౌరసేవల్లో మాత్రం పారదర్శకత లోపించడం గమనార్హం.
హైదరాబాద్ లో ఈ కార్డుల సమస్య ఇప్పటిది కాదు, గత 3 సంవత్సరాలుగా ఈ స్మార్ట్‌కార్డుల కొరత వెంటాడుతూనే ఉంది. వాహనదారులు నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ క్రమంలో కార్డులు పరిమితంగా ఉన్న సందర్భాల్లో కొంతమంది ఆర్టీఏ సిబ్బంది యథావిధిగా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ రూ.200 నుంచి రూ.300లకు కార్డు చొప్పున విక్రయిస్తున్నారు. కార్డుల కొరత తీవ్రంగా ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.