ముంబై: భారత దేశీయ ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్‌కార్ట్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి జపాన్ దిగ్గజ బ్యాంకు సాఫ్ట్‌బ్యాంక్ మరోసారి సిద్ధం అవుతోంది. ఒకే సారి 700 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్ ఫ్లిప్‌కార్ట్‌తో చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
దీంతో మూడేళ్ల క్రితం తన వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించిన ఫ్లిప్‌కార్ట్ విలువ ఇప్పుడు దాదాపు 28 బిలియన్ల డాలర్లకు చేరబోతోంది. మరో రెండు మూడు నెలలో ఈ డీల్ పూర్తయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతోపాటు ప్రోసస్ వెంచర్స్‌తో పాటు ఇప్పటికే ఉన్న ఇతర పెట్టుబడిదారులు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో తమ వాటాలను పెంచుకోనున్నాయి.
ఈ ఒప్పంద ఫలితంగా మొత్తం ఫ్లిప్‌కార్ట్ విలువ 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. లైవ్‌మింట్ నివేదిక ప్రకారం ప్రోసస్ వెంచర్స్, నాస్పెర్స్, విభాగం కూడా తమ వాటాను పెంచుకునేందుకు ఆలోచనలు చేస్తున్నాయి. రానున్న12-18 నెలల్లో లిస్టింగ్‌కు రానున్న తరుణంలో అంతకుముందే ఈ లావాదేవీలు పూర్తికానున్నాయని భావిస్తున్నారు.
ఫ్లిప్‌కార్ట్ కోసం జేపీ మోర్గాన్ గోల్డ్‌మన్ సాచ్స్ లావాదేవీలను నిర్వహిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, దాని డిజిటల్ చెల్లింపుల విభాగం ఫోన్‌పే 2022 నాటికి యుఎస్‌లో ఐపీవోకి వెళ్లాలని భావిస్తోంది. ఆ సమయానికి సుమారు 40 బిలియన్ల నికర విలువను సాధించాలని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడుల నిమిత్తం సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జీఐసీ, కెనడియన్ పెన్షన్ ఫండ్ సీపీపీఐబీ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆయా సంస్థలు అధకారికంగా స్పందించాల్సి ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌కు సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు కొత్తేమీ కాదు. అయితే క్రితం 2018లో తన పెట్టుబడులను సాఫ్ట్ బ్యాంకు ఉపసంహరించుకుంది.