న్యూఢిల్లీ : ఏఐసీసీ అద్యక్షురాలు సోనియా గాంధీ ఊహించినదే చేశారు. గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఆమె రాజీనామా చేశారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియా గాంధీ తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా తాను ఇకపై కొనసాగలేనని, బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని సీడబ్ల్యూసీ భేటీలో ఆమె స్పష్టం చేశారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు ఆమె సూచించారు.
సోనియా రాజీనామా లేఖను సభ్యులకు కేసీ వేణుగోపాల్ చదివి వినిపించారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల్లో సోనియా గాంధీ కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపాదించారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగే ఆసక్తి తనకు లేదని సోనియా గాంధీ సీడబ్లూసీ సభ్యులకు స్పష్టం చేశారు. ఈ పదవికి మరొకరిని ఎన్నుకోవాలని ఆమె సూచించారు.దీంతో పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపీక కోసం సీడబ్ల్యూసీ సభ్యులు చర్చలు జరుపుతున్నారు.
కాంగ్రెస్లో మార్పులు చేయాలని కోరుతూ 23 మంది కాంగ్రెస్ నేతలు పార్టీ అధినాయకత్వానికి లేఖ రాయడంపై రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి లేఖ రాయడానికి ఇది సరైన సమయం కాదని ఆయన అన్నారు. సోనియాగాంధీ ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఈ రకమైన లేఖను ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ సంక్షోభ సమయంలో లేఖలు రాయడం సబబు కాదన్నారు. సోనియా అధ్యక్ష పదవిలో కొనసాగాలన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్ల లేఖ వెనుక బీజేపీ హస్తం ఉందని రాహుల్ ఈ సందర్భంగా అనుమానం వ్యక్తం చేశారు.