దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. బ్యాంకాక్ నుండి ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన జేజు ఎయిర్ ఫ్లైట్ 7సీ2216 ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది.
బోయింగ్ 737-800 విమానంలో మొత్తం 181 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నా, వీరిలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రమాద సమయంలో విమానం రన్‌వే చివర అడ్డుగా ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ఢీకొట్టుదల కారణంగా ఇంధన ట్యాంకులు పేలి, విమానంలో భారీ మంటలు చెలరేగాయి.
రన్‌వే వద్ద వైఫల్యం, ల్యాండింగ్ గేర్ లోపం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల సమాచారం ప్రకారం, ల్యాండింగ్ సమయంలో పక్షి ఢీకొన్న కారణం కూడా ప్రమాదానికి దారితీసిందని భావిస్తున్నారు.
దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ ఘటనా స్థలంలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన ఆయన, ప్రమాదానికి సంబంధించి సమగ్ర విచారణకు ఆదేశించారు. విమాన భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.