అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రులను 287కు పెంచుతున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రుల్లో వైద్యులు, మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
కోవిడ్ కార్యక్రమాల కోసం తాత్కాలికంగా నియమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది జీతాలను పెంచాలని కూడా చెప్పారు. కోవిడ్–19 నివారణ చర్యలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి.
కోవిడ్ ఆసుపత్రుల్లో నిరంతరం ప్రమాణాలను పర్యవేక్షించాలి. హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి సేవలు సక్రమంగా అందాలి. మందులు ఇవ్వడం, చికిత్స అందించడం, వారి సందేహాలను నివృత్తి చేసే వ్యవస్థ సక్రమంగా ఉండాలి. కరోనా సోకితే ఏం చేయాలి? ఎవరికి ఫోన్ చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? ఎవరిని కలవాలి? అన్న వాటిపై ప్రజలకు బాగా ప్రచారం చేయాలి. ప్రతి రోజూ ఈ అంశాలను పర్యవేక్షిస్తే నాణ్యమైన సేవలు అందినట్లు అవుతుంది.
సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, మరియు ఇతర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేషెంట్లకు అన్ని ఆసుపత్రుల్లో అత్యుత్తమ సేవలు అందాలి. మనం ఆసుపత్రులకు వెళ్లినప్పుడు ఎలాంటి సేవలు కోరుకుంటామో ఆ విధానాలు కచ్చితంగా అక్కడ అమలు కావాలి. అన్ని చోట్ల విలేజ్, వార్డు క్లినిక్స్ నుంచి రిఫరల్ ప్రొటోకాల్ స్పష్టంగా అమలు జరగాలి.
కోవిడ్ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు బాగుండాలి. పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది, మరియు తగిన సౌకర్యాలు ఉండాలి. ఆ మేరకు వీలైనంత త్వరగా నియామకాలు పూర్తి చేయాలి. పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి. చికిత్స పొందుతున్న వారికి మంచి భోజనం అందించాలి.