హైదరాబాద్: ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 50 వరకు సైబర్ నేరాలు జరిగాయి. ఈ కేసులను ఛేదించిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు రూ.68 లక్షల వరకు రికవరీ చేసి సదరు బాధితులకు అందజేసినట్లు రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్ హరినాథ్ చెప్పారు.
ఈ సైబర్ మోసాలు ఎలాంటివంటే: కస్టమర్ కేర్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, ఫిష్పింగ్ కాల్స్, ఓటీపీ మోసాలు, హనీ ట్రాప్స్, గిఫ్ట్, పెట్టుబడి మోసాలు వంటి వివిధ ఆన్‌లైన్ మోసాలకు సంబంధించినవి ఉన్నాయి. కాగా ఈ కేసులన్నీ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. విచారణ సమయంలో ఒక ఖాతా నుంచి అనేక ఇతర అకౌంట్లు, వ్యాలెట్లకు నిధుల బదిలీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని సంబంధిత బాధితుల ఖాతాల్లోకి తిరిగి రికవరీ చేయించారు.
పలు సందర్భాలలో బాధితులు మోసానికి గురయ్యామని తెలిసిన తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 155260 కి ఫిర్యాదు చేయడం వల్ల సదరు బాధితుల ఖాతాను హోల్డ్‌లో ఉంచి, అలాగే నేరగాళ్ల ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దర్యాప్తు బృందాలు నిరంతరం ఈ వ్యవహారం పై విచారణ జరిపి నష్టపోయిన బాధితులకు పోగొట్టుకున్న మొత్తాలను తిరిగి వచ్చేలా చేశారు.
ఇదిలా ఉండగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఈ– మెయిల్స్ ద్వారా వచ్చే నకిలీ సందేశాలు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం కమీషనర్ ప్రజలను కోరారు. కేవైసీ అప్‌డేట్ అనో లేదా కస్టమర్ కేర్ సర్వీస్ అంటూ అపరిచిత వ్యక్తుల కాల్స్‌కు ఏ విధంగా స్పందిచకూడదని మరియు వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్. హరినాథ్ సూచించారు. సైబర్ మోసాలకు గురైన తక్షణమే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 155260 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును రికవరీ అయ్యే అవకాశముందని ఆయన తెలిపారు.