మాస్కో: కరోనా వైరస్ తో వణుకుతున్నా రష్యా, తామే సొంతంగా తయారు చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించింది. ఫ్రంట్‌లైన్ వర్కర్లకే టీకాలు ముందుగా ఇవ్వాలని నిర్ణయించిన రష్యా ప్రభుత్వం ఇందుకోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఇంతకుముందే నిర్వహించింది.
ఆరోగ్య శాఖ సంబంధిత సిబ్బంది, మున్సిపల్ వర్కర్లు, టీచర్లు, వైరస్ ముప్పు అధికంగా ఉండే ఇతరులు భారీ సంఖ్యలో వ్యాక్సిన్‌లు తీసుకోవడానికి రెజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారందరికీ టీకాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా డజనుకి పైగా వ్యాక్సినేషన్ సెంటర్లను ప్రారంభించారు.
రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ 95% సానుకూల ఫలితాలు ఇస్తుందని తేలడంతో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసారు. అయితే ఇంకా ఈ వ్యాక్సిన్‌పై మూడో దశ ప్రయోగాలు జరుగుతూ ఉండడం, టీకా భద్రతపై నిర్దిష్టమైన అంచనాలు రాకపోవడంతో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అంతర్జాతీయ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ని రెండు డోసులు గా ఇవ్వాల్సుంటుంది. మొదటి డోసు ఇచ్చిన 21 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారు. అయితే వ్యాక్సిన్ డోసులు ఎన్ని ఉత్పత్తి అయ్యాయో అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఏడాది చివరి నాటికి 20 లక్షల డోసులు ఉత్పత్తి చేస్తామని గమలేయా ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది.
అత్యధికంగా మాస్కోలో కేసులు నమోదవుతూ ఉండడంతో నగరానికి చెందిన ఆరోగ్య, పాఠశాల సిబ్బందితో పాటు సామాజిక కార్యకర్తలకి తొలుత టీకా డోసుల్ని ఇవ్వడం మొదలు పెట్టారు. శనివారం నుంచి మొదలైన ఈ కార్యక్రమం ఆదివారం కూడా భారీ స్థాయిలో కొనసాగుతుంది. ఇప్పటికే ప్రభుత్వంలో పని చేసే అధికారులు, సైనికులు లక్ష మంది వరకు వ్యాక్సిన్ ఇచ్చారు. అనారోగ్య సమస్యలేవీ లేకుండా 18–60 సంవత్సరాల మధ్య వయసున్న వారికి ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తున్నారు.