శ్రీలంక: శ్రీలంక కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే, భారత్-చైనా మధ్య తాము ఒత్తిడికి గురికావాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఏ రెండు దేశాల మధ్యనైనా చిక్కుకునే పరిస్థితులకు తాము దూరంగా ఉంటామని ఆయన తేల్చిచెప్పారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, శ్రీలంక విదేశాంగ విధానంపై తన వైఖరిని వివరించారు.
‘‘భౌగోళిక రాజకీయ యుద్ధంలో మేము పోటీదారులం కాదు. భవిష్యత్తులో ఈ యుద్ధాలలో భాగస్వామ్యం కావాలని మేము కోరుకోవడం లేదు. ముఖ్యంగా భారత్-చైనా మధ్య మేం ఇబ్బంది పడాలనుకోవడం లేదు. ఇరు దేశాలు మాకు అత్యంత విలువైన మిత్రులు. ఎన్‌పీపీ ప్రభుత్వ హయాంలో మా స్నేహబంధాలు మరింత బలపడతాయని నమ్ముతున్నాను. అదే సమయంలో ఐరోపా, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలతో కూడా సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నాం’’ అని ఆయన అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రపంచ శక్తుల అధిపత్య పోరాటాలకు శ్రీలంక దూరంగా ఉండాలని, తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం తటస్థ విధానాన్ని అనుసరించాలన్న ఆయన, ఉభయ పక్షాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టారు.
అనుర కుమార దిసనాయకే, ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించి, సోమవారం కొత్తగా శ్రీలంక 9వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూరియా ఆయన ప్రమాణ స్వీకారం నిర్వహించారు. తన ప్రసంగంలో, దిసనాయకే ప్రజాతీర్పును గౌరవిస్తూ, శాంతియుతంగా అధికార మార్పిడి జరిగినందుకు మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు కృతజ్ఞతలు తెలిపారు.