కొలంబో: గత కొద్ది రోజులుగా దేశంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో విపక్ష నేతలు, మరియు లంకేయులు అధ్యక్షుడితో సహా ప్రధాని రాజీనామా చేయాలని ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు.
ఈ సందర్భంలో సోమవారం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ప్రధాన మంత్రి మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల శ్రీలంకలో ఒక్కసారిగా రాజకీయ సంక్షోభం నెలకొంది.
అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో నిరసనకారుల దాడులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ఏర్పడిన ఉద్రిక్తతలకు పూర్తి బాధ్యత వహిస్తూ శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్స రాజీనామా చేసినప్పటికీ అల్లర్లు ఆగడం లేదు. అంతేకాదు హంబన్‌టోటాలోని రాజపక్స కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇంటికి కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు.