కొలొంబో: భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌కు సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ను ఇవాళ శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగానే ఈ నెల 18వ తేదీ నుండి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుందని, కానీ స్వల్ప సమయ మార్పులు ఉంటాయని వెల్లడించింది.
మ్యాచ్ లు జులై 18, 20, 23న అరగంట ఆలస్యంగా (అంటే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు), 25, 27, 29న జరిగే టీ20లు గంట ఆలస్యంగా(భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) ప్రారంభించనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ట్విటర్ వేదికగా శ్రీలంక క్రికెట్ బోర్డు అభిమానులతో పంచుకుంది.
మరోవైపు, ఇటీవలే ఇంగ్లండ్ పర్యటన ముగించుకొని తిరిగి స్వదేశానికి చేరుకున్న లంక జట్టులో ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అయితే దీనివల్ల ఈనెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లు జులై 18కి వాయిదా పడ్డాయి.
ఇదే క్రమంలో శ్రీలంక బోర్డు ఆయా మ్యాచ్‌ల ప్రారంభ సమయాల్లో స్వల్ప మార్పులను చేసింది. ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 గంటలకు, టీ20లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభంకావాల్సి ఉంది.