లండన్ : భారత దేశానికి చెందిన 15వ శతాబ్ధం నాటి సీతారాముల వారి విగ్రహాలను లండన్ నుంచి తిరిగి తెప్పించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 1978లో తమిళనాడులోని విజయనగర కాలంలో నిర్మించిన ఆలయం నాటి విగ్రహాలు అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఇవి ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు గుర్తించారు.
దీంతో 2019 ఆగస్టులో లండన్‌లోని భారత హైకమిషన్ ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ ద్వారా ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వానికి విన్నవించింది. అంతేకాకుండా దొంగతనానికి గురైన రామలక్షణులు, సీత, హనుమంతుని విగ్రహాలకు సంబంధించిన ఫోటో ఆర్కైవ్‌లను కూడా నిపుణుల మందుంచారు. ఇవి ప్రస్తుతం లండన్‌లో ఉన్నవేనని దృవీకరిస్తూ సమగ్ర నివేదికను పంపారు.
భారత సాంస్కృతిక వారసత్వానికి గుర్తుగా ఉన్న ఈ విగ్రహాలను భారత్‌కు తిరిగి పంపాల్సిందిగా అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన యూకే ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఈ విగ్రహాలను కొన్నవ్యక్తి ప్రస్తుతం జీవించిలేరు. అంతేకాకుండా వీటికి చట్టబద్దమైన ఆధారాలు ఏమీ లేనందున ఈ విగ్రహాలను తిరిగి భారత్‌కు అందించడానికి హైకమిషన్ సముఖత వ్యక్తం చేసింది.
అతి త్వరలో వీటిని తమిళనాడుకు బదిలీచేయనున్నారు. గతంలోనూ రాణి-కి వావ్, బుద్ధుడి కాంస్య విగ్రహం, 17వ శతాబ్ధపు కృష్ణుడి విగ్రహం సహా పలు భారత సంపదను తిరిగి స్వదేశానికి చేర్చడంలో హెచ్‌సిఐ ముఖ్యపాత్ర పోషించింది. రాబోయే రోజుల్లో, ఎఎస్ఐ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ, స్వతంత్ర దర్యప్తు సంస్థల భాగస్వామ్యంతో ముందుకు వెళ్తామని హెచ్‌సిఐ ఓ ప్రకటన విడుదల చేసింది.