టాలీవుడ్: కారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరో గా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలు చేస్తున్నాడు శ్రీ విష్ణు. అందివచ్చిన అవకాశాల్ని వాడుకుంటూ ప్రతీ సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. ‘బ్రోచేవారెవరు రా’ సక్సెస్ తర్వాత శ్రీ విష్ణు గ్రాఫ్ బాగా పెరిగింది. ప్రస్తుతం శ్రీ విష్ణు చేతిలో ‘రాజ రాజ చోర’, ‘గాలి సంపత్’ ,’అర్జున ఫాల్గుణ‘ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితో పాటు ఇపుడు మరొక సినిమా మొదలు పెట్టాడు ఈ యువ హీరో.
‘బాణం‘ సినిమాతో నారా రోహిత్ ని పరిచయం చేసి డైరెక్టర్ గా తొలి అడుగు వేసాడు ‘చైతన్య దంతులూరి’. ఈ సినిమా అంతగా ఆడనప్పటికీ హీరో రోహిత్ కి మరియు డైరెక్టర్ కి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం తనయుడి తో ‘బసంతి’ అనే సినిమా రూపొందించి ఫెయిల్యూర్ మూటకట్టుకున్నాడు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.
ప్రస్తుతం శ్రీ విష్ణు, చైతన్య కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందబోతుంది. ‘భళా తందనాన’ అనే పూర్తి తెలుగు టైటిల్ తో ఈ సినిమా రూపొందబోతుంది. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మణి శర్మ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు కి జోడీ గా కేథరిన్ థెరీసా నటిస్తుంది.