హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్న క్రమంలో తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం సల్పంగా నమోదవుతున్నాయి. అలాగే మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.
ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లోని ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న నలుగురు సబ్ ఇన్స్పెక్టర్లు, మరియు నలుగురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు రెండోసారి కోవిడ్ నిర్ధారణ అయ్యింది.
గత జూన్ నెలలో కరోనా వచ్చి నయం అయిన వారికి మరోసారి పాజిటివ్ రావడంతో పోలీసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్ ఎలక్షన్లలో భాగంగా డ్యూటీలు చేసిన ఎస్ఐలకు, కానిస్టేబుళ్లు, సిబ్బందికి రెండోసారి కోవిడ్ రావడంతో ఆందోళన కలిగిస్తుంది. ఈ తరుణంలో అంతమంది పోలీసులకు ఒకేసారి కరోనా సోకడం తీవ్ర కలకలం రేపుతోంది.