అమరావతి: ఎట్టకేలకు ఏపీలో టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కాసేపటి క్రితం ప్రకటించారు. ఇవాళ సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షల విషయమై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని అన్నారు.
కాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జులై 31 నాటికి పరీక్షల నిర్వహణ, మూల్యాంకణ మరియు పరీక్షా ఫలితాల ప్రకటన సాధ్యం కాదని తెలిపారు. ఈ విషయాన్ని తాము రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు.
టెన్త్ మరియు ఇంటర్ పరీక్షల నిర్వహణ మరియు ఫలితాల ప్రకటనకు కనీసం 45 రోజుల సమయం అవసరం అని మంత్రి సురేష్ తెలిపారు. అయితే విద్యార్థులకు మార్కులను ఎలా కేటాయించలనే దానిపై ఒక హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఈ హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన తరువాతే మార్కులపై తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సుప్రీంకోర్టు సూచన మేరకే పరీక్షల రద్దు చేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ నిర్ధారించారు.