తెలంగాణ: శాసనసభలో లోక్‌సభ పునర్విభజన వ్యతిరేకంగా చేసిన తీర్మానంపై తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ఆవిర్భవించిన ఆకాంక్ష హైదరాబాద్‌లో సాకారమైందని ఆయన అన్నారు.
పారదర్శక డీలిమిటేషన్‌ను కోరుతూ తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానం సమానత్వానికి, సమాఖ్య విలువలకు నిలువైన ఉదాహరణ అని స్టాలిన్ పేర్కొన్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేలా కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్ చట్టాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని స్టాలిన్ సూచించారు. ఇదంతా అఖిలపక్ష సమ్మేళనం మొదటి విజయం మాత్రమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ తీసుకున్న ఈ అడుగు మిగతా రాష్ట్రాలకు మార్గదర్శకమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో త్వరలో రెండో సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) సమావేశం జరుగుతుందని స్టాలిన్ వెల్లడించారు. దేశ భవిష్యత్తును అన్యాయపూరితంగా మార్చే ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య సమతుల్యతను కాపాడేందుకు రాజకీయంగా ఒకతాటి మీద ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ శాసనసభ తీర్మానం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయి అని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. కేంద్రం తలపెట్టిన విధానాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.