చెన్నై: “జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే, మన స్వదేశంలోనే మనమే రాజకీయ అధికారాన్ని కోల్పోయినవారిగా మారిపోతాం” అని తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రంగా హెచ్చరించారు.
డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా చెన్నైలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు ఇది ఒక చారిత్రక ముందడుగు అవుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే, పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశముందని, ఇది నైతికంగా తప్పని ఆయన స్పష్టం చేశారు. మన సమ్మతి లేకుండా చట్టాలు తయారయ్యే పరిస్థితి వస్తుందని, మన అభిప్రాయాల బలం తగ్గిపోతుందని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు ముందుండడంతో ప్రస్తుతం అక్కడ జనాభా పెరుగుదల తక్కువగా ఉందని, ఇది ఇప్పుడు ప్రతికూలంగా మారుతుందనడం దుర్మార్గమని స్టాలిన్ అభిప్రాయపడ్డారు.
ఉత్తరాదిన జనాభా పెరుగుదల అధికంగా ఉండటంతో వారికే అధిక ప్రాతినిధ్యం లభించడమంటే దక్షిణం అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిందేనన్నారు.
విద్య, నిధులు, ఉద్యోగాలు, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రభావం పడేలా రాజకీయ ప్రాతినిధ్యానికి ముప్పు తలెత్తుతుందని స్టాలిన్ హెచ్చరించారు. డీలిమిటేషన్ లాంటి కీలక అంశంపై దక్షిణ రాష్ట్రాలన్నీ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.