న్యూఢిల్లీ: మనం భూమి మీద ఎన్నో రకాల హోటళ్లను చూసుంటాం. కానీ అంతరిక్షంలో హోటల్ అంటూ ఉంటే ఎలా ఉంటుంది, అనుకుంటున్నారా? అయితే ఇంకో ఆరేళ్ల పాటు ఓపిక పడితే స్పేస్ హోటల్ని చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆర్బిటాల్ అసెంబ్లీ కార్పొరేషన్ అనే ఒక కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఈ స్పేస్ హోటల్ పేరు ‘వాయిజర్ స్పేస్‌స్టేషన్’. సుమారు 400 మందికి ఆతిథ్యం ఇవ్వనున్న ఈ హోటల్లో సకల సౌకర్యాలు ఉంటాయట.
మన భూమి మీద హోటల్ రూమ్లకంటే ఈ రూమ్‌లు మరింత అడ్వాన్స్డ్గా ఉండబోతున్నాయి. వాయిజర్లో బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, లైబ్రరీలు, కచేరీ వేదికలు, హెల్త్ స్పాలు, జిమ్‌లు, స్పేస్‌లో నుంచి భూమినీ చూసేందుకు లాంజ్‌లు, బార్లు కూడా ఉంటాయని సదరు కంపెనీ తెలిపింది.
2025లో ప్రారంభమయ్యే ఈ హోటల్ నిర్మాణం 2027 నాటికి పూర్తవుతుంది. అప్పటినుంచి పర్యాటకులను హోటల్లో బస చేసేందుకు అనుమతిస్తారు. అయితే స్పేస్ హోటల్ ఉన్న వ్యక్తులు గాల్లో తేలకుండా ఉండేందుకు హోటల్ భ్రమణ రేటులో హెచ్చుతగ్గుల ద్వారా కృత్రిమ గురుత్వాకర్షణ శక్తిని ఉత్పత్తి చేసే విధంగా హోటల్‌ను నిర్మించనున్నట్లు ఓఏసీ చెప్పింది.
ఈ హోటల్ నిర్మాణంలో అనుభవం కలిగిన నాసా శాస్త్రవేత్తలతో పాటు పైలెట్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు పనిచేయనున్నారు. 2012లోనే వాయిజర్ స్టేషన్ ఐడియా వచ్చింది. అది కార్యరూపం దాల్చేందుకు 2018లో ఓఏసీని ఏర్పాటు చేశారు. అయితే హోటల్ నిర్మాణానికయ్యే ఖర్చు, ఒకరోజు హోటల్లో గడిపేందుకు చెల్లించాల్సిన బిల్లు ఎంత అనేది ఇంతవరకు ఓఏసీ ప్రకటించలేదు.