అమరావతి: సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేసే వారిపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపేందుకు సిద్ధమైంది. ప్రత్యేకంగా, రాష్ట్రవ్యాప్తంగా వ్యవస్థీకృతంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అనైతిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు కఠినమైన చట్టాలు అమలులోకి తెస్తున్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 111 ప్రకారం, సోషల్ మీడియాలో అసభ్యకరమైన, హేయమైన పోస్టులు చేసే వారికి మరణదండన లేదా జీవిత ఖైదు విధించవచ్చు.
కొత్త చట్టం ప్రకారం కఠిన శిక్షలు
భారతీయ న్యాయ సంహిత 111 ప్రకారం, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు, మార్ఫింగ్ చిత్రాలు, బూతు వ్యాఖ్యలు వంటి కార్యకలాపాలు నేరంగా పరిగణించబడతాయి. బీఎన్‌ఎస్ 111 (2)(ఏ) ప్రకారం బాధితులకు ప్రాణాపాయాన్ని కలిగించినట్టు తేలితే మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు. ప్రాణాపాయం కాకపోయినా కనిష్ఠంగా ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించే అవకాశముంది.
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వ్యవస్థీకృత నేరాలు
పోలీసుల పరిశీలనలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వ్యవస్థీకృత నేరాలుగా నిర్వహిస్తున్నట్టు తేలింది. ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయివరకు కన్వీనర్లు, సభ్యులన నియమించి వేరే వేరే ఖాతాల ద్వారా అసభ్యకరమైన, అనైతిక పోస్టులు చేయడమే కాకుండా వాటిని ప్రోత్సహిస్తున్నారు. ఈ చర్యలలో భాగస్వాములు అందరూ బీఎన్‌ఎస్ 111 ప్రకారం ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్’లో భాగమని చట్టం గుర్తించింది.
డిజిటల్ ఫుట్ ప్రింట్ ద్వారా పట్టుబడే అవకాశం
నిజమైన పేరు, ఫొటో ఉపయోగించకపోయినా, ఐపీ అడ్రస్, డిజిటల్ ఫుట్ ప్రింట్ల ఆధారంగా నేరస్థులను పట్టుకోవడం చాల సులభమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేరాల్లో దొరికిన వారికి కఠినమైన శిక్షలు తప్పవని వెల్లడించారు. ఒకసారి కేసు నమోదు అయితే ఉద్యోగావకాశాలు, పాస్‌పోర్ట్, వీసాల కోసం ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు.
సహకరించినా శిక్షలు తప్పవు
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడమే కాకుండా, వీటిని ప్రోత్సహించడం, అందుకు సహకరించడం కూడా నేరమేనని బీఎన్‌ఎస్ 111 (3) ప్రకారం పేర్కొంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ సభ్యులుగా కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సివుంటుంది, తస్మాత్ జాగ్రత్త!