విశాఖపట్నం: తల్లి తండ్రి గురువు దైవం అనే పద పరంపరను ఎన్నో ఏళ్ళుగా అందరూ పాఠశాలలో చదువుకుంటూ ఉంటారు. అయితే నిజ జీవితంలో దాన్ని ఎంత వరకు పాటిస్తారన్నది ప్రశ్నార్థకం. గురువు ప్రతి మనిషి జీవితంలో తల్లితండ్రి తరువాతి స్థానంలో ఉంటారు. ఆ గురువు తర్వాతే దైవం అంటారు. ఎందుకంటే గురువు చదువు చెప్పి విద్యాబుద్దులు నేర్పి, జీవితంలో మంచి మార్గంలో నడవడానికి మరియు ఉన్నతంగా బతకడానికి కావాల్సిన జ్ఞానాన్ని అందిస్తాడు.
మన జీవితంలో మనం మంచి స్థాయిలో ఉన్నామంటే దానికి మన తల్లితండ్రులతో పాటు గురువు కూడా ఒక కారణమే. అలాంటి మాస్టారుకు ఏమిచ్చినా తక్కువే. వారి రుణం తీర్చుకునే అవకాశం లభించడమే అదృష్టం. అలాంటి పరిస్థితే ఎదురయ్యింది విశాఖపట్నం జిల్లాలోని కొందరు గ్రామస్తులకి. గురువు మీద అభిమానంతో వారు చేసిన పనిని ఇప్పుడు అందరు కొనియాడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు మూడో విడత నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. ఈ క్రమంలో కొయ్యూరు మండలం మంప గ్రామంలో స్కూల్ టీచర్‌గా పని చేసిన ఇంగువ త్రినాథ్ పడాల్ సర్పంచ్‌గా బరిలో నిలిచారు. తమకు చదువు నేర్పిన గురువు పట్ల విద్యార్థులైన అబ్యర్థులు తనకు కృతజ్ఞతగా వారు చేసిన నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
అందువల్ల ఆ ఉపాధ్యాయుడు ఇంగువ త్రినాధ్ పడాల్ మంప గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులను గ్రామస్తులు ప్రశంసించారు.