అమరావతి: “ఇలాంటి వెర్రివాడా మనల్ని పాలించింది?” – జగన్‌పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. అదానీ ముడుపుల వ్యవహారంలో జగన్‌కు సంబంధించిన రూ.1750 కోట్ల అవినీతిపై ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ విషయమై త్వరలో ఏసీబీకి (ACB) ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
అదానీ ఒప్పందంపై విమర్శలు
షర్మిల మాట్లాడుతూ, “జగన్ ప్రభుత్వం అదానీతో 25 ఏళ్లకు ఒప్పందం చేసి ప్రజలపై 50 పైసల అదనపు భారాన్ని మోపింది. పక్క రాష్ట్రాల్లో కేవలం రూ.1.99 పైసలకు సోలార్ పవర్ విక్రయిస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లో రూ.2.49 పైసలకు కొనుగోలు చేయడం దారుణం” అని ఆరోపించారు. ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు లేకున్నా విద్యుత్ శాఖ అధికారులు 1.70 పైసల వరకు ఛార్జీలు ఉండే అవకాశం ఉందని తెలిపారు.
“వెర్రి వాడే ఐదేళ్లు పాలించాడు”
జగన్‌ను ఉద్దేశిస్తూ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. “ఎఫ్‌బీఐ ఛార్జ్‌షీట్‌లో నా పేరు లేదు” అని చెప్పడం జగన్ వెర్రితనమని, ప్రజలు “ఇలాంటి వెర్రివాడా మనల్ని ఐదేళ్లు పాలించింది” అని అనుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
“మౌనంగా ఉన్న బాబు, వెనుకడుగు వేసిన జగన్”
అదానీ డీల్ విషయంలో చంద్రబాబు కూడా ఏటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. “ఇది ప్రజలపై ఆర్థిక భారం వేస్తుంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ డీల్‌ను పెద్ద కుంభకోణం అని పేర్కొంది. కానీ ఇప్పుడు మౌనంగా ఉంది” అంటూ చంద్రబాబుపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గంగవరం పోర్టు అమ్మకాలు, వివేకా హత్యపై షర్మిల ఆగ్రహం
“గంగవరం పోర్టును పూర్తిగా అమ్మేయడం, వివేకా హత్య కేసును మూసేయడం వంటి చర్యలు ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయి. జగన్ ప్రభుత్వం రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టింది” అని షర్మిల అన్నారు.
ఏసీబీకి ఫిర్యాదు
“సెకీ ఒప్పందాలపై మా వద్ద ఉన్న ఆధారాలతో ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం. అదానీతో చేసిన డీల్ రద్దు చేయకపోతే చంద్రబాబు కూడా నేరారోపణల నుండి తప్పించుకోలేరు” అని షర్మిల హెచ్చరించారు.
“సోషల్ ఇష్యూ పర్సనల్‌గా ఎలా మారుతుంది?”
జగన్ ప్రభుత్వ అవినీతిపై తాను మాట్లాడితే పర్సనల్‌గా తీసుకుంటున్నారని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. “విధుల్లో వైఫల్యాలను ఎత్తి చూపడం నా బాధ్యత. ఇది వ్యక్తిగతం కాదు” అన్నారు.
సీనియర్ల మద్దతు ఉందని స్పష్టీకరణ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిరుత్సాహంగా ఉన్నారని వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, “పార్టీలో సీనియర్ల మద్దతు నాకు ఉంది. ఎవరూ పార్టీలో అసంతృప్తిగా లేరు” అని షర్మిల చెప్పారు.