హైదరాబాద్: తెలుగు సినిమా గేయ రచయితల్లో రెగ్యులర్ పాటలు కాకుండా కొన్ని ప్రత్యేక పాటలు రాయడంలో సుద్దాల అశోక్ తేజ సిద్దహస్తుడు. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలోని ‘నేను సైతం’ అనే పాటకి జాతీయ అవార్డు కూడా పొందారు. ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలో దాదాపు మొత్తం పాటలు రాసి సినిమా గేయ రచయితగా మంచి పేరు గడించారు. గేయ రచయితగానే కాకుండా సూపర్ సింగర్ లాంటి ప్రోగ్రాం కి న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు. గత కొద్ది రోజులుగా సుద్దాల అశోక్ తేజ గారి పైన రూమర్స్ వ్యాప్తి చెందుతున్నాయి. ఆయన ఆరోగ్యం బాగాలేదంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వీటన్నికి సమాధానంగా ఆయనే సోషల్ మిడిల్ లో ఒక వీడియో పోస్ట్ చేసి ఈ రూమర్స్ అన్నిటికి చెక్ పెట్టారు.
‘‘మీ అందరి ప్రేమ వల్ల, దయ వల్ల, ప్రభుత్వం అందించిన సహాయ సహకారాల వల్ల కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన తరవాత మెల్లమెల్లగా రోజురోజుకి నేను కోలుకుంటున్నాను. మళ్లీ పాటలు రాస్తున్నాను. నేను చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను. కాకపోతే, ఈ కరోనా ఉండటం వల్ల ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రజలందరి మాదిరిగానే జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది తప్ప.. నా ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అశోక్ తేజ ఆరోగ్యం మళ్లీ విషమంగా ఉందని వార్తల్లో వచ్చినట్టు తెలిసింది. వాటిలో నిజం లేదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను’’ అని వీడియోలో అశోక్ తేజ వెల్లడించారు. తన ఆరోగ్యం బాగుండాలని తలచిన శ్రేయోభిలాషులందరికి, అభిమానులకి ధన్యవాదాలు తెలియచేసారు.